కరోన వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి అల్లోల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణా చారి, దేవాదాయ శాఖ కమిషర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. కరోన వైరస్ ప్రబలకుండా ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తుందన్న నేపథ్యంలో దర్శనం కోసం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కరోన వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు మైక్ ల ద్వారా అనౌన్స్ మెంట్ చేయాలన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆలయాధికారులకు సర్క్యూలర్ జారీ చేశారు.
ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు: మంత్రి అల్లోల