కరోనా: 600 సోషల్ మీడియా పోస్టులు తొలగించిన ముంబై పోలీసులు


హైదరాబాద్: అసలే సోషల్ మీడియా.. ఆపై కరోనా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎవరికి తోచింది వారు ఓ పోస్టు పెట్టేయడం చేతులు కడిగేసుకోవడం షరా మామూలై పోయింది. అందుకో ముంబై పోలీసులు సీరియస్ అయ్యారు. కరోనాకు సంబంధించిన 600 అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియా నుంచి తీసిపారేశారు. అందులో ఫేక్ న్యూస్ ఐటెంలు, మతోన్మాదన్ని రెచ్చగొట్టే  వీడియోలు, ఆడియోలు కూడా ఉన్నాయి. అలా తొలగించి వదిలేయకుండా ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి 155 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ముంబై పోలీసు సైబర్ విభాగం డీఐజీ హరీశ్ బైజాల్ తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా ముంబై పోలీసు గూఢచార విభాగం సోషల్ మీడియా ల్యాబ్ ఆ పోస్టులను తొలగించింది. వాటిలో అత్యధికం తప్పుదోవ పట్టించేవి, నిరాధారమైనవి, ప్రజల్లో భయోత్పాతం సృష్టించేవి, మతపరమైన ఉద్రిక్తతలు కలిగించేవి ఉన్నాయని బైజాల్ చెప్పారు. మొదట్లో కరపోనా గురించి తప్పుడు సమాచారపం ఇచ్చే పోస్టులు ఎక్కువగా వచ్చాయని, తర్వాత తబ్లీగీ జమాత్‌పై సందేసాలు దావానలంలా వ్యాపించాయని వివరించారు. 'మేం అన్నీ జాగ్రత్తగా గమనిస్తుంటాం.. తర్వాత విశ్లేషణ జరిపి ఎవరెవరు లేదా ఏయే గ్రూపులు రెచ్చగొట్టే వీడియోలు, పోస్టులు పెడుతున్నారో తెలుసుకుంటాం. ఆపై అలాంటి శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని బైజాల్ చెప్పారు. ఇందుకు 30 మంది సాంకేతికంగా సుశిక్షితులైన బృందం రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు పనిచేస్తుంటుందని తెలిపారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, టెలిగ్రాం వంటి అన్ని సామాజిక మాధ్యమాలను పరిశీలిస్తుంటారని చెప్పారు.